భయపెట్టడం ఎలాగో బాగానే నేర్చుకున్నారు రాఘవ లారెన్స్. ‘ముని’, ‘కాంచన’ సిరీస్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబట్టుకున్నాయి. ఒకే కథని అటూ ఇటూ మార్చి, దానికి కమర్షియల్ హంగులు జోడించి, మాస్‌కి నచ్చేలా తీర్చిదిద్దడంలో లారెన్స్ తనదైన ముద్ర వేసేశారు. ఆ పరంపరలో ఇప్పుడు ‘కాంచన 3’ కూడా వచ్చేసింది. గత చిత్రాలకంటే ఎక్కువ హంగులు, ఇంకాస్త గ్లామర్, మరింత యాక్షన్‌ను జోడించి తెరకెక్కించిన ‘కాంచన 3’ ఎలా ఉంది? ఈ సినిమాతో లారెన్స్ ఇంకెంత భయపెట్టారు?
కథ: రాఘవ (రాఘవ లారెన్స్)కి దెయ్యాలంటే భయం. పడుకునేటప్పుడు కూడా మంచం చుట్టూ చెప్పులు, నిమ్మకాయలు పెట్టుకుంటాడు. రాఘవ తన కుటుంబంతో కలిసి తాతయ్య ఊరికి వెళతాడు. ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచీ చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. అర్ధరాత్రి అరుపులు, కేకలు వినిపిస్తుంటాయి. ఎవరో అటూ, ఇటూ పరుగులు పెడుతున్నట్లు కనిపిస్తుంటుంది. ఆ ఇంట్లో దెయ్యాలున్నాయని అఘోరాలు కూడా చెప్తారు. ఆ దెయ్యం రాఘవని కూడా ఆవహిస్తుంది. ఆ దెయ్యం పేరే... కాళి. మరి కాళి ఎవరు? రాఘవని ఎందుకు ఆవహించింది? కాళి లక్ష్యం ఏమిటి? అనేది తెలియాలంటే ‘కాంచన 3’ చూడాల్సిందే.
విశ్లేషణ: లారెన్స్ ఎంచుకునే దెయ్యం కథలన్నీ ఒకే ఫార్ములాలో సాగుతుంటాయి. కథానాయకుడ్ని ఓ దెయ్యం ఆవహించడం, ఆ దెయ్యంతో సమస్యలు, దాని వెనక ఓ ఫ్లాష్ బ్యాక్ ఉండటం.. తన పగ తీర్చుకోవడానికి కథానాయకుడి శరీరాన్ని ఆసరాగా చేసుకోవడం..ఇదే కథ. ‘కాంచన 3’లోనూ అదే జరిగింది. గత దెయ్యం సినిమాల స్క్రీన్ ప్లే, నేపథ్య సంగీతంతో సహా.. చాలా విషయాల్లో పోలికలు కనిపిస్తుంటాయి. కాకపోతే.. ఈసారి రాఘవను ఆవహించిన దెయ్యం ఒకటి కాదు. రెండు. ఆ రెండు దెయ్యాలకూ ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కాళి జీవితాన్ని సర్వనాశనం చేసిన వాళ్లని దెయ్యం రూపంలో రాఘవను అడ్డుపెట్టుకుని ఎలా పగ తీర్చుకున్నాడో చూపించి కథని ముగించారు.
బంగ్లాలోకి దెయ్యం రావడం, ఆ దెయ్యాన్ని చూసి అంతా భయపడడం, ఆ దెయ్యం.. బంగ్లాలో ఉన్నవాళ్లందరితోనూ ఆడుకోవడం... ఇదంతా అక్కడక్కడా నవ్విస్తుంది. రాఘవ స్వతహాగా డ్యాన్సర్ కాబట్టి, మంచి డాన్స్ మూమెంట్స్ ఉన్న పాటలను ప్రేక్షకులు కోరుకోవడం సహజం. ఆ లెక్కలతోనే పాటలన్నీ సాగాయి. ఆ పాటల్లో రాఘవ డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి. సినిమాలో అరవై సన్నివేశాలుంటే అందులో సగానికి పైగా మాస్‌ని లక్ష్యంగా చేసి రాసుకున్నవే. కామెడీ కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతుంది. ఇంకొన్ని చోట్ల నవ్విస్తుంది. ద్వితీయార్ధంలో కాళి ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలతో సాగిపోతుంది. కాళి చేసే మంచి పనులు, సేవా కార్యక్రమాలు.. వీటితో ఫ్లాష్ బ్యాక్ నిండిపోతుంది. రాఘవ తీసిన గత కథల్లానే.. ఈ సినిమానీ ముగించాడు. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం, కామెడీ అక్కడక్కడా శ్రుతిమించడం.. ‘కాంచన 3’కి కాస్త ప్రతికూలంగా మారాయి. మాస్‌ని మెప్పించే అంశాలూ ఉండడం కలిసొచ్చే విషయం.
నటీనటులు: రాఘవ పాత్రలో మూడు షేడ్స్ ఉంటాయి. పిరికివాడిగా, కాళిగా, కాళి ఆవహించిన రాఘవలా.. మూడు రకాలుగా నటించారు. కాళి పాత్ర, ఆ గెటప్ కాస్త కొత్తగా ఉంటాయి. డాన్సులు ఆకట్టుకున్నాయి. మిగిలినదంతా రొటీనే. ముగ్గురు కథానాయికలు ఉన్నా, ఏ పాత్రకీ ప్రాధాన్యం లేదు. వాళ్ల ఓవర్ మేకప్ మరింత ఇబ్బంది పెడుతుంది. కోవై సరళ ఎప్పటిలా అరచి గోల పెట్టింది. శ్రీమాన్ ఓకే అనిపిస్తాడు. పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు. లారెన్స్ స్టెప్పుల కోసమే ఆ పాటలు చూడాల్సి వస్తుంది. నేపథ్య సంగీతమూ అంతంత మాత్రమే. కథా కథనాలు ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. కమర్షియల్ విలువలనే లారెన్స్ నమ్ముకున్నట్టు అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
మైనస్ పాయింట్స్
Please submit your comments.