అమెరికాలోని ఎన్నారైలకు ట్రంప్ సర్కారు పెద్ద షాకిచ్చింది. ఇప్పటికే హెచ్-1బీ వీసాల జారీ విషయంలో ట్రంప్ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్స్‌పై నిషేధం విధించే ప్రక్రియ మొదలైనట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో అగ్రరాజ్యంలో ఉద్యోగం చేస్తున్న వేలాది ఇండియన్ టెక్కీ కుటుంబాలపై ప్రభావం పడనుంది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్స్‌ను తొలగించేలా ట్రంప్ సర్కార్ గతంలో ప్రతిపాదనలు తయారు చేసింది. ఈ ప్రతిపాదనలపై ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైనట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఇప్పుడు ఈ ప్రక్రియ రెండో దశకు చేరుకుంది. ఇక్కడ ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందింతే వాటిని ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురిస్తారు.
ఆ తర్వాత కొత్త ప్రతిపాదనలపై 30-60 రోజుల వరకు ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు వీలు కల్పిస్తారు. అనంతరం దీనిపై చట్టం చేస్తారు. అయితే, ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలు కనుక అమల్లోకి వస్తే భారతీయులే అధికంగా నష్టపోనున్నారు. హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్ కార్డు కోసం ఎదురుచూసే వారి జీవిత భాగస్వాములు అమెరికాలోని కంపెనీల్లో పనిచేసేందుకు హెచ్-4 ఈఏడీ వీసాల కింద వీలు కల్పిస్తూ 2015లో బరాక్ ఒబామా గవర్నమెంట్ ఒక విధానాన్ని రూపొందించింది. అయితే, ఈ విధానాన్ని తొలగిస్తామని ట్రంప్ 2018, ఫిబ్రవరిలో ప్రకటించారు. ఇక హెచ్-4 ఈఏడీ వీసాల వల్ల భారతీయులు, ఎక్కువగా మహిళ ఇంజినీర్లు లబ్ధి పొందుతున్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు జారీ చేసిన 1.2 లక్షల ఈ వీసాల్లో 90 శాతం భారతీయులే పొందిన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే, ఈ విధానం తొలగింపుపై ఇప్పటికే భారీ మొత్తంలో వ్యతిరేకత వస్తోంది. అయిన ట్రంప్ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గే ప్రశక్తేలేదని చెబుతోంది.
Please submit your comments.