పాలనలో మార్పులు తీసుకువస్తా.. మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అని ప్రమాణ స్వీకారం రోజే చెప్పిన ఏపీ సీఎం జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీని మద్యపాన నిషేద రాష్ట్రంగా మార్చడానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో దశల వారీగా మద్యపానం నిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో అన్వేషించాలని సూచించారు. శనివారం (జూన్ 1) మధ్యాహ్నం ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తాడేపల్లిలోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
మద్యపానాన్ని నిరుత్సాహ పరిచేలా కార్యాచరణ ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. గొలుసు దుకాణాలపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాజీపడొద్దని అధికారులకు సూచించారు.
రాష్ట్రం అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వడ్డీలు కట్టేందుకు కూడా అప్పులు ఎందుకు చేస్తున్నామని అధికారులను నిలదీశారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సాంబశివరావు, పీవీ రమేశ్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్. రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవీంద్ర, సీఎం కార్యదర్శి ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Please submit your comments.