ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం చంద్రబాబును జగన్ ఆహ్వానించినా ఆయన మాత్రం తన తరుఫున ప్రతినిధులను పంపాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను టీడీపీ ఎమ్మెల్యేలు గంటా, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌లకు బాబు అప్పగించారు. దీంతో వారు జగన్ కలిసి శుభాకాంక్షలు తెలియజేయాలని ప్రయత్నించినా సీఎం అపాయింట్‌మెంట్ దొరకలేదని ప్రచారం సాగుతోంది. తాజాగా, దీనిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం తిరుమలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌కి టీడీపీ తరఫున శుభాకాంక్షలు తెలిపేందుకు రెండు రోజులపాటు ప్రయత్నించినా అవకాశం లభించలేదని వ్యాఖ్యానించారు.
జగన్ వద్దకు వెళ్లి స్వయంగా శుభాకాంక్షలు తెలపడానికి తనతోపాటు ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడును పార్టీ అధిష్ఠానం నియమించిందన్నారు. జగన్‌ను కలిసే ప్రయత్నం చేసినా కుదరలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవని గంటా అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంతో పాటు మీడియానూ బెదిరిస్తున్నట్లుగా మాట్లాడారని, ఎన్నికల వేళ నవరత్నాల పేరిట ఇచ్చిన హామీల నుంచి అప్పుడే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు వ్యాఖ్యానించారు. టెండర్ల రద్దు విషయంలో గత ప్రభుత్వంపై కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీలో మోదీని కలిశాక ప్రత్యేక హోదాపై స్పష్టంగా మాట్లాడలేక జగన్ డొంకతిరుగుడుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.
వృద్ధాప్యపు పింఛన్లు రూ.3వేలకు పెంచుతామని చెప్పిన కేవలం రూ.250తో సరిపెట్టి రూ.2,250కి పరిమితం చేశారన్నారు. మద్యపాన నిషేధం విషయంలోనూ మాట దాటవేస్తూ దశలవారీగా అమలుచేసి ఆఖరుగా హోటళ్లలో విక్రయిస్తామని అంటున్నారని విమర్శించారు. టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఏకాభిప్రాయంతోనే ఎన్నుకున్నామని గంటా తెలిపారు. టీడీపీ గెలుపోటములు కొత్తకాదని, గతంలోనూ ప్రతిపక్ష పాత్ర పోషించిందన్నారు. ఎన్నికల్లో ఓటమిపై త్వరలో పార్టీలో అంతర్గతంగా విశ్లేషించుకొని, పొరపాట్లను గుర్తించి, తిరిగి ప్రజల మద్దతు పొందేందుకు చర్యలు తీసుకుంటామని గంటా స్పష్టం చేశారు.
Please submit your comments.