పవన్ కళ్యాణ్ ప్రవేశం ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో గుణాత్మక మార్పుని తీసుకొచ్చింది. ఇప్పటివరకు రెండు పార్టీల మధ్య వున్న పోటీని మూడు పార్టీల మధ్యకు మారటం ఖచ్చితంగా ఓ గుణాత్మక మార్పే. ముఖ్యంగా రెండు ధన మదగజాల మధ్య రాజకీయ ఆటని ఇంకో ప్రత్యామ్నాయంతో ప్రజలకు అవకాశం కల్పించటం ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే రెండు జాతీయ పార్టీల పాత్ర లేకుండా లోక్ సభ ఎన్నికలు జరగటం ఎక్కడా లేదు. రెండింటిలో ఏదో ఒకటైనా పోటీలో లేని రాష్ట్రం ఆంధ్ర ఒక్కటే. అంటే పోటీలో లేరని కాదు. సాంకేతికపరంగా పోటీలో వున్నావాటి పాత్ర నామ మాత్రమేనని అందరికీ తెలుసు. ఆ పరిస్థితుల్లో మూడో ప్రత్యామ్నాయంగా జనసేన ఇంకో ప్రాంతీయ పార్టీగా ముందుకొచ్చింది. మిగతా రెండు పార్టీలతో పోల్చుకుంటే ధనబలం లేని పార్టీగా జనసేనని చెప్పొచ్చు. అయితే రాజకీయాల్లో డబ్బులే ప్రధానం కాదని చరిత్రలో రుజువైన సంగతి మరచి పోవద్దు. ఢిల్లీ లో ఆప్ ఇటీవలి కాలంలో కేవలం జనబలం తోటే అధికారంలోకి వచ్చింది. దురదృష్టవశాత్తు ఆ ఒరవడిని ఆప్ కొనసాగించలేకపోవటం ఎంతోమందికి నిరాశను మిగిల్చింది. అది పక్కన పెట్టినా సరిఅయిన ప్రత్యామ్నాయం చూపిస్తే ప్రజలు ఆదరిస్తారని ఢిల్లీ ఎన్నికలు రుజువు చేసాయి. అయితే దీనికి ఎంతో కష్టపడాల్సి వుంది. ప్రజలకు విశ్వాసం రావటం ఒక్క రోజులో జరిగే పనికాదు. అందుకు ఎంతో శ్రమించాల్సి వుంది.
పవన్ కళ్యాణ్ గత ఆరు నెలలనుంచి తన పర్యటనలు, ప్రసంగాలు, జనంతో చర్చలు లాంటి కార్యక్రమాలతో కొంతమేరకు భిన్న సంస్కృతి ని, ప్రత్యామ్నాయాన్ని తీసుకురావటానికి ప్రయత్నించాడని చెప్పొచ్చు. అయితే మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాలు విస్తృతంగా తిరగలేకపోవటం వలన ఈ ప్రత్యామ్నాయాన్ని అన్ని ప్రాంతాలకు, జిల్లాలకు తీసుకెళ్లలేకపోవటం ప్రధాన లోపం. అందుకు ఇంకా ముందుగా పర్యటనలు మొదలు పెట్టివుండాల్సింది. ఈ ప్రధాన లోపాన్ని అధిగమించటానికి మిగతా పార్టీలను కలుపుకొని వెళ్ళటం వ్యూహాత్మకంగా మంచి నిర్ణయమే. ముఖ్యంగా బీఎస్పీ లాంటి మూడో పెద్ద జాతీయ పార్టీని తన కూటమిలోకి తెచ్చుకోవటం తెలివైన పనే. బీఎస్పీ ఆంధ్రాలో పెద్దగా బలంలేకపోయినా మాయావతి ని తమ ప్రతినిధిగా దళితులు గుర్తిస్తారు. అదేసమయంలో ఆమె మీద అవినీతి ముద్రవున్న విషయం కూడా మనం మరిచిపోవద్దు. వున్న పరిమితి వనరులతో, సమయాభావంతో, రెండు ప్రధాన జాతీయ పార్టీలు అంటరాని పార్టీలుగా ముద్రపడిన తరుణంలో పవన్ కళ్యాణ్ వ్యూహం కొంత నైతిక బలాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీ లతో కలిసి పోటీకి దిగటం వున్న పరిస్థితుల్లో సరి అయిన వ్యూహమే. అంతవరకు బాగానే వుంది. ఆ వ్యూహంతో ప్రజలముందుకి రావటం మూడో ప్రత్యామ్నాయాన్ని వుంచినట్లయింది.
దానితోపాటు అభ్యర్థుల ఎన్నిక కూడా ఓ ముఖ్యమైన ఘట్టమే. ధీటైన అభ్యర్థులను నిలబెట్టటం ప్రజలకు ఈ ఫ్రంట్ పై విశ్వాసం కలిగించడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. అందునా ప్రజారాజ్యం విషయంలో జరిగిన గత అనుభవం రీత్యా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతయినా వుంది. అప్పట్లో సీట్లు అమ్ముకున్నారనే ప్రచారం లో వాస్తవం ఎంతో తెలియదుకాని చిన్న తప్పుకోసం ఎదురుచూస్తున్నపత్రికలకి ఇది ఓ బంగారు అవకాశంగా ఉపయోగపడింది. దానితో అప్పటిదాకా వున్న అనుకూల పవనాలు కాస్తా ఎదురుతిరిగాయి. ఆ అనుభవంతో పవన్ కళ్యాణ్ సీట్ల పంపిణి విషయంలో ఈసారి జాగ్రత్తపడ్డాడని చెప్పాలి. ఓ విధంగా ఎటువంటి వ్యతిరేకత లేకుండా సీట్ల పంపిణీని పూర్తిచేయటం ఈసారి ఈఘట్టంలో విజయం సాధించాడని చెప్పాలి.
ఇప్పటివరకు వ్యూహాలన్నీ పకడ్బందీగానే వున్నాయి. అయితే అసలు కధ తుది ఘట్టంలోనే వుంది. ఏ ఎన్నికల్లోనైనా చివరి అంకమే కీలకం. అందులో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మొదటికే మోసమొస్తుందని గ్రహించాలి. ప్రచారసరళి ఇందులో అత్యంత ప్రధానమైంది. దానిమీదే తుది ఫలితం ఆధారపడివుంటుంది. ఇటీవల జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇందులోనే కేసీఆర్ విజయం సాధించాడు. కాంగ్రెస్ తీసుకున్న తప్పుడు వ్యూహం ఆత్మహత్యా సదృశమైంది. అదే వ్యూహాన్ని ఇప్పుడు చంద్రబాబునాయుడు కాపీ కొట్టి ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో వాడుతున్నాడు. కేసీఆర్ పై దాడి ఇందులో భాగమే. అయితే ఇది తెలంగాణాలో క్లిక్ అయినట్లు ఆంధ్రాలో కాక పోవచ్చు. ఎందుకంటే చంద్రబాబునాయుడు తెలంగాణ ఎన్నికల్లో ముందుండి ప్రచారం చేసినట్లు ఆంధ్ర ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేయడంలేదని మరచిపోవద్దు. చంద్రబాబునాయుడు ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ ప్రత్యక్షంగా ఆంధ్ర ఎన్నికల ప్రచారానికి రానంతకాలం అది క్లిక్ కాదు. ప్రజలు దాన్ని చీప్ ఎత్తుగడగానే చూసే అవకాశముంది. ఐడియాస్ లో ఒరిజినాలిటీ లేకపోతె వచ్చే ఫలితం అంతంత మాత్రమే. మొదటి దఫా అధికారంలోకి వచ్చినప్పుడు దేశం మొత్తం మీదా సంస్కరణలకు ఆద్యుడుగా నిలిచిన చంద్రబాబునాయుడు ఈ సారికాపీ మాస్టారుగా ముద్ర వేయించుకున్నాడు. తెలంగాణ లో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో పధకాలను కాపీ కొట్టటం అందరికీ తెలిసిందే. చివరకు ఎన్నికల ప్రచారసరళిని కూడా కాపీ కొట్టటం చూస్తే తను ఐడియాస్ విషయంలో exast అయ్యాడని అనిపిస్తుంది. ఇది చంద్రబాబు పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ తుది ఘట్టపు ప్రచార సరళి ని ఒక్కసారి పరిశీలిద్దాం.
తుదిఘట్టానికి ముందు ప్రధానంగా ప్రభుత్వంలో వున్న తెలుగుదేశం ని టార్గెట్ చేసుకొని మాట్లాడటం ప్రజలు బాగా రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ పై సెటైర్లు ప్రజలు అద్భుతంగా ఆస్వాదించారు. అంటే వారసత్వ రాజకీయాలపై తన విమర్శ ప్రజల గుండెల్ని తాకిందని చెప్పొచ్చు. మరి ఆతర్వాత కొన్ని తప్పులు జరిగాయి. తుది ఘట్టం లో ఇవన్నీ ఫలితాన్ని ప్రభావితం చేస్తాయని మరవొద్దు. ఒకటి , నారా లోకేష్ పై జనసేన పోటీపెట్టకుండా మిత్రపక్షానికి వదిలివేయడం పెద్ద బ్లండర్. దాన్ని వైరిపక్షం ప్రచారానికి వాడుకుంది. మొదటిసారిగా జనసేనపై ఓ ఆయుధం ఇచ్చినట్లయింది. రెండు, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని ఇన్నాళ్లు ప్రచారం చేసి తన తమ్ముడు నాగబాబుని తీసుకురావటం ఇతరుల్ని ప్రశ్నించే నైతికతను కోల్పోయినట్లయింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకురావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకోవటం జరిగింది. ఆ ప్రత్యేక పరిస్థితులేమిటో ఇంకొంచెం వివరంగా చెప్పి ఉండాల్సింది. ఈ రెండూ ప్రచారసరళికి ముందు జరిగిన పరిణామాలు. ఇక ప్రచార సరళి లో జరుగుతున్న తప్పులేంటో చూద్దాం.
ప్రచార సరళి లో చంద్రబాబునాయుడు పై అదివరకు చేసిన ఘాటు విమర్శలు లోపించాయి. లోకేష్ ని పూర్తిగా వదిలిపెట్టాడు. అదేసమయంలో జగన్ పై విమర్శలదాడిని పెంచాడు. అదీ చంద్రబాబునాయుడు తరహాలోనే విమర్శించటం అంతగా హర్షణీయంగా లేదు. అసెంబ్లీకి రాకుండా బాధ్యతలు విస్మరించాడని అంతకుముందు చేసిన విమర్శను ప్రజలు బాగానే ఆస్వాదించారు, కానీ జగన్ కి వోటువేస్తే కేసీఆర్ కి వోట్ వేసినట్లేనని చెప్పటం సద్విమర్శ కాదు. చంద్రబాబునాయుడు చేసే చీప్ రాజకీయాలకు పవన్ వంత పాడినట్లుగా వుంది తప్పిస్తే నిజాయితీ తో కూడిన విమర్శగా లేదు. అయినా సరిపెట్టుకుందామనుకున్నా చంద్రబాబునాయుడుపై విమర్శను తగ్గించటం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. దానితో జగన్ జనసేన తెలుగుదేశానికి బి టీం అని చేస్తున్న ప్రచారం ప్రజలు నమ్మేటట్లుగా వుంది. తక్షణం పవన్ తన ప్రచారసరళి ని మార్చుకోకపోతే ఇప్పటివరకు వచ్చిన అనుకూలతను పోగొట్టుకున్నవాడవుతాడు. రెండోది, తెలంగాణా పై ద్వేషాన్ని రగిలించటం బాధ్యతా రాహిత్యమని చెప్పాలి. అందునా జనసేన అక్కడా పోటీలో వున్న టైములో. తక్షణం దానిపై వివరణ ఇవ్వాలి. తుదిఘట్టంలో ఈ తప్పులు తనపై వచ్చిన అనుకూలత ( పరిమితమైన ప్రాంతంలోనైనప్పటికీ ) ప్రతికూలతగా మారే ప్రమాదముంది. ఇప్పటికైనా తెలుగుదేశంతో ఒప్పందంవుందని ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో ( అది వాస్తవం కాకపోయినా ) దాన్ని కాదని నిరూపించటానికైనా తెలుగుదేశంపై అంతకుముందుచేసినట్లు ఘాటు విమర్శలు చేయకపోతే అది నిజమని ప్రజలు నమ్మే పరిస్థితి వుంది. వచ్చే పది రోజుల్లో తన ప్రచారసరళిపైనే తనకు వచ్చే ఫలితాలు ఆధారపడివుంటాయని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. లేకపోతే తన గొయ్యి తానే తవ్వుకున్నట్లవుతుంది. కాబట్టి వచ్చే మూడు వారాలు పవన్ రాజకీయ పరిణితి కి పరీక్ష. ఇందులో నెగ్గుతాడో లేదో వేచిచూద్దాం.
పవన్ కళ్యాణ్ తుదిఘట్టంలో తప్పటడుగులు
1 Comments
Write a comment ...
Samba
Let us hope that wiser counsel will prevail over Pavan Kalyan and the movement he has started will move forward.